title

WISHES ON FORMATION OF SEPARATE STATE OF TELANGANA - dedicated to the MARTYRS

Friday, June 11, 2010

JAGAN vs KCR.....why that difference ......?


తెలంగాణను ప్రశాంతంగా బతకనివ్వరా! ప్రత్యేక తెలంగాణ కోసం పలవరించిన తెలంగాణను ప్రశాంతత పేరిట సంయమనం పాటించమని అడిగిన వాళ్లను అడగాల్సిన ప్రశ్న ఇది. అసలు రాష్ట్రాన్ని పాలిస్తున్నది ఎవరు? ఇదొక స్టేటా? ప్రైవేటు ఎస్టేటా? మానుకోటలో పరమక్రూరంగా ప్రజా ప్రతినిధుల గన్‌మెన్‌లు కాల్పులు జరిపి తొమ్మిది మంది తెలంగాణ వాదుల రక్తం రుచి చూసిన తర్వాత... కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభువులు, రాష్ట్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్ ప్రభువులకు ఈ ప్రశ్న వేయవలసి ఉన్నది.

పోలికలు చూస్తేనేగానీ.. పోల్చి చూసుకుంటేనేగానీ.. తెలంగాణ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంత వివక్షతో ప్రవర్తిస్తోందో? అర్థంగాదు. కేవలం అయిదు నెలల క్రితం తెలంగాణ మొదటిసారి రణరంగమైంది. కారణం. కేసీఆర్ అరెస్టు.. గుర్తు చేసుకోక తప్పదిక్కడ.. మళ్లీ అయిదు నెలల తర్వాత.. శుక్రవారం పట్టపగలు మానుకోట స్టేషన్‌లో తెలంగాణవాదుల నెత్తురు చిందింది.

మూల కారకుడైన వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌ను అరెస్టు చేశారు. అప్పుడు కేసీఆర్ అరెస్టును, ఇప్పటి జగన్ అరెస్టును పోల్చుకుంటే చాలు. వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజా ప్రతినిధుల స్వేచ్ఛలో ఉండే తేడా.. వివక్ష... అణచివేత లక్షణానికి ఒక ప్రాంతం మీద ఉండే కక్ష సులభంగానే అర్థం అవుతుంది. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశారు.

అరెస్టయ్యే నాటికి ఆయన కూడా ఎంపీ. ఒక బలమైన ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే పార్టీ అధినేత. ఆయన నిరాహార దీక్ష చేస్తామన్నారు. కరీంనగర్ తెలంగాణ భవన్‌లో ఉదయం విలేఖరులతో మాట్లాడి, అలుగునూరు క్రాస్‌రోడ్స్‌కు వచ్చీరాగానే కేసీఆర్ కాన్వాయ్‌ను దారి మళ్లించి, గ్రేహౌండ్స్ లాంటి పోలీసుల ఆధ్వర్యంలో ఎత్తుకెళ్లారు. ఇది మరచిపోయే ఘట్టమేమీ కాదు.

ఒక తెలంగాణ కేంద్ర మాజీ మంత్రి, ఎన్నోసార్లు ఎన్నికైన ఎంపీని.. ఎత్తుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. ఇప్పటి రణరంగ క్షేత్రం వరంగల్ జైలులో ఉంచితే.. శాంతి భద్రతల సమస్యలని, ఆ కొసన ఉన్న ఖమ్మం జైలుకు తరలించారు. తన చుట్టూ గ్రేహౌండ్స్‌ను మోహరించారని, బలవంతంగా దాడి చేసి, నిరాహారదీక్ష విరమింప చేశారని, నాయిని లాంటి వాళ్లు ఆ గొడవల్లో గాయపడ్డారని.. కేసీఆర్ పదే పదే చెప్పారు కూడా. అట్లా గాంధీ పద్ధతిలో ఆమరణదీక్షకు కూచుంటానన్న ఒక తెలంగాణ ఎంపీకి పట్టిన గతి అది.

ఖమ్మం జైలు నుంచి వరంగల్‌కు తరలించాలని డిమాండ్ చేసినా ఒప్పుకోలేదప్పుడు.. జైలులాంటి దీక్ష.. దీక్షలో జైలు. పైగా రాజద్రోహం కేసు హెచ్చరిక. పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ... ఇదీ.. అప్పటి రణరంగ జ్ఞాపకం... ఆ తర్వాత తెలంగాణ నెత్తురు పూవై వికసించడం.. పల్లెలు మేల్కొనడం.. చిదంబరం డిసెంబర్ 9 ప్రకటన.. అనంతర విద్యార్థిలోకం ఉద్యమాలు.. ఇటీవలి చరిత్రే... ఇంకా నమోదు కూడా కాని చరిత్ర. తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నందున అది వర్తమానం కూడా.

కానీ.. మొన్న ఏమి జరిగింది... కాంగ్రెస్ పార్టీ ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆయన మొదటిసారి ఎన్నికైన ఎంపీ మాత్రమే... కాకపోతే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమారుడు. మూడు రోజులుగా వరంగల్ రగులుతూ ఉన్నది. జగన్ వరంగల్‌కు వస్తే... ఊరుకోమని, అడ్డుకుంటామని తెలంగాణ వాదులు మోహరించారు. అధిష్ఠానం చెప్పింది. రోశయ్య ఇద్దరు మంత్రులతో చెప్పించారు... 11 మంది తెలంగాణ ఎంపీలు జగన్ పర్యటన వాయిదా వేసుకోమన్నారు. వీరప్ప మొయిలీ చాతుర్యమైన మాటలతో అధిష్ఠానం ఆమోదం లేదన్నారు.

రాజ్‌కుమార్ అనే తెలంగాణవాది జగన్ వస్తాడంటేనే ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ.. జగన్ పట్టుదల వీడలేదు. ఇన్ని ప్రతిఘటనల మధ్య ఒకే ఒక సాకు ఓదార్పు సాకుతో శుక్రవారం పొద్దున్నే జగన్ యాత్రకు బయలుదేరారు. ఎవరూ అడ్డుకోలేదు. గ్రేహౌండ్స్ కాదు గదా! సామాన్య పోలీసులూ వారి వెంటా కాన్వాయ్‌లాగా.. కలిసిమెలిసి నడిచి.. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఏసీ డబ్బాలో కూచోబెట్టారు. వంగపల్లి దాకా తోడుండి తీసుకెళ్లారు. మానుకోట రగుల్కున్నాక.. కొండా మురళి, సురేఖల గన్‌మెన్‌లు తెలంగాణ వాదుల మీద కాల్పులు జరిపిన తర్వా త.. ఇక్కడ వంగపల్లిలో జగన్‌ను అరెస్టు చేశారట.

రాచమర్యాదలతో సినిమా ల్లో చూపించే మాదిరి కారెనుక కారుతో అధికార లాంఛనాలతో జగన్‌ను అరెస్టు చేసి.. కేసులు కూడా పెట్టి చివరికి.. భువనగిరి డీఎస్‌పీ, సీఐలు తోడ్కొని వెళ్లి ఆయన కాన్వాయ్‌ని ఇంటి వరకు జాగ్రత్తగా వదిలిపెట్టి వచ్చినట్లు వార్తలు... దీన్నేమంటారు? వ్యక్తిగత లేదా పౌర స్వేచ్ఛల గురించి, ఎవరైనా ఎక్కడికైనా వెళ్లడం గురించి, భావస్వేచ్ఛ గురించి మాట్లాడేవాళ్లందరికీ.. దీన్నేమంటారు? ఇది ఎవరి ప్రభుత్వం? ఒకే రకమైన సంఘటనల్లో.. ఒకేరకమైన ప్రాతినిధ్యం, పలుకుబడి, వ్యక్తిగత హోదా కలిగిన ఇద్దరి పట్ల ఒకే రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా రెండు రకాలుగా ఎందుకు ప్రవర్తిస్తుంది?

ఇది ఒక ప్రాంతం పట్ల వివక్ష కాదా? దీనికి ఎవరు సమాధానం చెప్పగలరు? ప్రాంతీయ వివక్ష లేదంటున్న వారికి.. మనమందరం ఒకటే అంటున్న వారికి.. తెలుగు జాతి,భాష, ఔన్నత్వంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో సమైక్యాంధ్ర సంగతులు మాట్లాడుతున్న వారికి.. స్వేచ్ఛ గురించి ప్రశ్నించేవారికి.. స్వేచ్ఛ ఒక విలువగా.. స్వేచ్ఛ ఒక రాజ్యాంగ హక్కుగా, స్వేచ్ఛ ఒక ప్రాథమిక హక్కుగా.. రెండు విధాలా ఎందుకు ఉంటుందన్నదే ప్రశ్న. జగన్.. సమైక్యవాది. దాంట్లో దాచుకోవలసిందేమీ లేదు.

ఆ మాటకొస్తే.. వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా కరడుగట్టిన సమైక్యవాది. ఆయన నంద్యాలలో కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్శించి ఉన్నారు. తెలంగాణ అంటే ఉన్న అక్కసునంతా వెళ్లగక్కి ఉన్నారు. ఆయన వారసుడే జగన్. తెలంగాణ కోసం ప్రాణాలను గడ్డిపోచల్లా తీసుకుంటున్న వేళ.. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు జరుగుతున్న వేళ.. తెలంగాణ ఒక టైమ్‌బాంబ్ మీద కూచున్నట్టుంది. అయిదు నెలలుగా అది.. నెత్తుటి కలలు కంటున్నది.. తెలంగాణ ఇప్పుడు దానికదిగా శాంతిగానే ఉన్నది.

ఉస్మానియా యూనివర్సిటీకి చివరికి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌ను రానివ్వని ప్రభుత్వం.. శాంతికోసం తెలంగాణలో ఏ ఒక్కసభకూ అనుమతివ్వని ప్రభుత్వం.. జగన్‌లాంటి వాళ్లను ఏ అనుమతి లేకుండా టైమ్ బాంబ్ లాంటి తెలంగాణకు పంపించడానికి ఎందుకు సాహసం చేసినట్టు.. ఇది అసలు ప్రశ్న. అనుమతి లేదు.. అధిష్ఠానం ఆమోదం లేదు.. పార్టీలో అందరి సమ్మతి లేదు. అయినా ఆయనను ఇంట్లో అరెస్టు చేయని ప్రభుత్వం మానుకోట నెత్తురు బాకీ చెల్లించుకోవలసి వస్తుంది.

అసలు ప్రభుత్వం ఉందా? ఉంటే అది పని చేస్తుందా? అది ఎవరి ప్రభుత్వం.. ఒక ప్రాంతం పట్ల కొనసాగుతున్న ఈ వివక్ష, అణచివేతలకు వ్యతిరేకంగా తెలంగాణ నిలబడడం ఎట్లా సంకుచితం అవుతుంది. ప్రజాప్రతినిధులు చేయాల్సింది రెండే. ప్రజాసేవలో సమర్థతను చాటుకోవడమా? లేక తప్పుకోవడమా? శుక్రవారం పొద్దునే వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పత్రికలో మాస్ట్‌హెడ్ పక్కన ఆయన తండ్రి, దివంగత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఫొటో కింద రాసి ఉన్న ప్రవచనాలివి.

ఎవరైనా ఈ వ్యాఖ్యలను జాగ్రత్తగా గమనిస్తే.. జగన్ అంతరంగం కాస్తయినా అవగతమవుతుంది. ఆయన అ రోజు పొద్దుట్నుంచే తన 'సమర్థత'ను నిరూపించుకున్నారు. మానుకోటలో కనీసం తొమ్మిది మంది నెత్తురును కళ్లజూసిన ఆ 'సమర్థత' భవిష్యత్‌కు సూచిక కూడా. రాజకీయాల్లోకి ఇట్లాంటి 'సమర్థత' గల యువ నాయకత్వం వస్తే భవిష్యత్తు ఏమిటనేది కూడా అర్థం చేసుకోవచ్చు. జగన్ అంతరంగం ఎట్లా తయారై ఉంటుంది? అది ఆయన తండ్రి వారసత్వం కూడా.

No comments:

Post a Comment