కొండకోనల వెండివెలుగుల
గిరుల సిరులు పైరునగలు
మొగులునంటిన కరుణమూర్తి
ముక్కోటీబిడ్డల కలలధాత్రి
మా అవ్వ గదరా తెలంగాణా
మా బువ్వ గదరా తెలంగాణా..
కోట్లగొంతులు కలిసిపాడిన
ప్రత్యేక రాష్ట్రము కలలకోన
“మా అవ్వ”
గుట్టమీద చెట్టు కొమ్మన
గువ్వ పాడిన పాట పల్లవి
వాననిచ్చే కారుమబ్బులు
ఒరిసిమెరిసిన మెరుపు తల్లిది
గోదారిక్రుష్ణ నదుల మధ్యన
పరుచుకున్న పంటచేనుర
గుండెనిండిన మాట తానై
గోరుముద్దలు కొసిరిపెట్టే..
“మా అవ్వ”
పాలకంకుల జొన్న చేలు
తెలంగాణ తల్లి కరములమరు
తల్లిబిడ్డను ఎత్తినట్లుగ
మక్కపీసు తలను నిమురు
తామరాకులు కలువపూల
చెరువుదొరువులు నీటిసంపద
నా తల్లికేమి తక్కువాయెర
తలనువంచి మొక్కవేమిర
“మా అవ్వ”
కోస్తనుండి చుట్టరికము
కలుపుకొచ్చిరి మోసగాళ్ళు
సీమనుండి దిగిరి కొందరు
చింతలప్పుడె మొదలుకదరా
మద్రాసునిడిచిన శని ఇపుడు
మనల గట్టిగ పట్టుకున్నది
మాయమాటల మూటలల్లి
కొలువునెలువులు దోచినారు
నీటివనరులు మలిపినారు
నిండమనలను ముంచినారు
పావలర్ధకు భూమి దోచి
చేలు చెలుకలు చేతబట్టిరి
మనకంటిలొ మన ఏలుపెట్టీ
వాడునింగికి ఎదిగినాడు
చెరనుబట్టిరి తెలంగాణ తల్లిని
అనాధలైతిమీ నేలమీద..
“మా అవ్వ”
తెలుగు తల్లి అమ్మగాదు
మము పెంచిపెద్ద చెయ్యలేదు
గామె మాకు అవ్వ అయితె
నల్లగొండ నాగమల్లి
గామె మాకు అవ్వే అయితె
పాలమూరూ పాలవెల్లి
మెదకు జిల్లా బతుకుమారు
వరంగల్లు వెతలుతీరు
కరువుకాటకములు రెండు
కలిసినమిలి మింగె గదరా
ఎటూ చూసిన ఎడారేను
ఎటు పారెను జీవనదులు
మా పాలివానికిది పాలవెల్లి
పగవానిదె ఆ తెలుగు తల్లి..
“మా అవ్వ”
తల్లి చెరను బాప బిడ్డల
తండ్లాట యేబదేండ్లది
అమరులైన బిడ్డల కొరకు
తల్లి శోకము యేబదేండ్లది
గుండెపగిలి తల్లడిల్లిన
పేరు పేరున పిలిచి తలిచే
“మా అవ్వ”
రావణా సమ్హారమునకు
రణము ఒకటే మిగిలినట్టు
చావొ రేవో తేలెదాక
పోరాటమొక్కటె మార్గమున్నది
తెలంగాణ విముక్తి కొరకు
రండీరన్న లెండిరన్నా
కదం కదము కలిపి నడిచి
కదనరంగమున దుముకుదామూ….
మా అవ్వ గదరా తెలంగాణా
మా బువ్వ గదరా తెలంగాణా…..
— అల్లం వీరయ్య
No comments:
Post a Comment