జై తెలంగాణ, జై ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రాలకోసం సమైక్య ఉద్యమం
శ్రీకారం చుట్టిన కె.సి.ఆర్-కత్తి పద్మారావు
అపోహల తొలగింపునకు 29న విజయవాడలో మహాసభ
ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలను ఉమ్మడిగా నూతనోత్తేజంతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్.), ఆంధ్ర ప్రదేశ్ దళిత మహాసభ సంయుక్తంగా నిర్ణయించాయి. టి.ఆర్.ఎస్. నాయకుడు కె. చంద్రశేఖరరావు, దళిత మహాసభ నాయకుడు కత్తి పద్మారావు సోమవారం నాడు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కలుసుకుని ఈ మేరకు ఒక రాజకీయ అవగాహనకు వచ్చారు. ప్రజల మధ్య అపోహలు తొలగిపోవడానికి వీలుగా ఈ నెల 29 వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న మహాసభకు రావలసిందిగా కె.సి.ఆర్.ను కత్తి పద్మారావు ఆహ్వానించారు. ఇందుకు కె.సి.ఆర్. కూడా ఆనందంగా తమ సమ్మతి తెలియజేశారు.
ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలు పొట్టకోసం వచ్చిన చిరుద్యోగులకు వ్యతిరేకం కాదని, ప్రజలను మోసగిస్తూ, దోపిడీ సాగిస్తున్న కొంతమందికి మాత్రమే వ్యతిరేకమని కత్తి పద్మారావు వివరించారు. ప్రజల సంపదను కొల్లగొడుతున్నవారికి, ప్రజల సంస్కృతిని విధ్వంసం చేస్తున్నవారికి మాత్రమే ఈ ఉద్యమాలు వ్యతిరేకమని ఆయన వివరించారు. కె.సి.ఆర్, ను కలుసుకోవడానికి కత్తి పద్మారావు సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్‌కు వచ్చారు. ఉభయులూ గంటపైగా చర్చించుకున్న అనంతరం అన్ని విషయాలపైనా సదవగాహన ఏర్పడింది. అనంతరం ఇరువురూ సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రాల ఆవిర్భావం కోసం ఇకనుంచి సమైక్యంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా కత్తి పద్మారావు పేర్కొన్నారు.
ప్రత్యేక తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఒక దళితుణ్ణే కూర్చోపెడదామని కె.సి.ఆర్. చెప్పారని, అది తమకు చాల సంతోషంగా ఉందని కత్తి పద్మారావు ఆనందం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణకు దళిత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజున కె.సి.ఆర్, ప్రొఫెసర్ జయశంకర్ వంటివారు ఆ దళిత నాయకుని పక్కన నిల్డ్చవాలని, అలాగే, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక దళిత నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నరోజున కూడా వీరిరువురూ అక్కడ నిల్చోవాలని ఆయన కోరారు.
ప్రత్యేక తెలంగాణ వస్తే ఆంధ్ర ప్రాంతానికి ఏదో నష్టం జరిగిపోతుందని అపోహలు సృష్టించారని, ఆ అపోహలు తొలగిపోవాలని, అందుకే తాము విజయవాడలో మహాసభకు నడుం కట్టామని కత్తి పద్మారావు వివరించారు. ప్రత్యేక ఆంధ్రకోసం జరిగే ఆనాటి మహాసభకు కె.సి.ఆర్. విచ్చేస్తారని, అలాగే ప్రత్యేక తెలంగాణకోసం ఇక్కడ జరిగే సభలకు తాము వస్తామని, ఈ సంఘీభావంతో ఇకనుంచి తామంతా ఏక భావనతో లక్ష్యసాధనకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. కత్తి పద్మారావు చెప్పిన విషయాలను కె.సి.ఆర్. ధ్రువీకరిస్తూ ఈ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. తాను విజయవాడ మహాసభలో ప్రసంగిస్తామని కె.సి.ఆర్. ప్రకటించారు. ఆయన ఈ ప్రకటన చేస్తుండగానే ఒక మీడియా ప్రతినిధి వై.ఎస్. జగన్‌ను తెలంగాణాలో పర్యటించరాదని మీరు హెచ్చరించి ఇప్పుడు మీరెలా విజయవాడ సభలో పాల్గొంటారని ప్రశ్నించగా, ఆయన పర్యటించరాదన్న మాట తన నోట మాత్రం రాలేదని కె.సి.ఆర్. గుర్తు చేశారు. ఇకపోతే తెలంగాణకోసం ఇంతమంది యువకులు చనిపోతే, వారిని కూడా పరామర్శిస్తానని అనకుండా, కేవలం ఒక అంశం గురించి మాత్రమే మాట్లాడడం వల్ల జగన్ పర్యటనపై కొంతమంది తమ అసంతృప్తి తెలియజేస్తున్నారు అనిఅన్నారు.
JAI TELANGANA
JAI JAI TELANGANA
No comments:
Post a Comment