పోరు చరిత
జై తెలంగాణాని ఉయ్యాలొ,
బతుకు పోరుజెయ్య ఉయ్యల!
మానీళ్ళు మాకోసం ఉయ్యాలొ,
మాపోరుసాగంగ ఉయ్యాల!
యాభయ్యేండ్లసంది ఉయ్యాలొ,
అణుచుకుంటిమి బాధ ఉయ్యాలొ!
మా జాగ మాకేనని ఉయ్యాలొ,
జంగు సైరనూదినాము ఉయ్యాల!
ఇన్నేండ్ల తండ్లాట ఉయ్యాలొ,
తెలంగాణ రావలే ఉయ్యాల!
నినదించి జనమంత ఉయ్యాలొ,
నిరహర దీక్షలు ఉయ్యాల!
గొంతులో పొలికేకలు ఉయ్యాలొ.
యుద్ద నాదములాయే ఉయ్యాల!
ఆత్మా గౌరవము ఉయ్యాలొ,
మేముగోరినాము ఉయ్యాల!
న్యాయపోరాటము ఉయ్యాలొ,
నిప్పుల్ల మండింది ఉయ్యాల!
కాసోజు శ్రీకాంతు ఉయ్యాలొ,
మండేటి సూర్యుడు ఉయ్యాల!
నిలువెల్లా మంటల్ల ఉయ్యాలొ,
నినాదమిడవలే ఉయ్యాల!
బలిదానలెన్నున ఉయ్యాలొ,
బతుకులు మారలె ఉయ్యాల!
మాకొలువు మాకంటే ఉయ్యాలొ,
మమ్ముల కొట్టిరి ఉయ్యాల!
యూనివర్సిటిలల్ల ఉయ్యాలొ,
ఉద్యమించే బిడ్డలు ఉయ్యాల!
ఉద్యమాల సదువులు ఉయ్యాలొ,
ఉగ్గుపాల బట్టె ఉయ్యాల!
ప్రశ్నించే దిక్కులు ఉయ్యాలొ,
గర్జించే సింహాలు ఉయ్యాల!
హక్కులు కోరితె ఉయ్యాలొ,
మక్కలిరగతన్నె ఉయ్యాల!
కొవ్వొత్తి బట్టిన ఉయ్యాలొ,
కేసులు బెట్టిరి ఉయ్యాల!
లాఠీ చార్జిలల్ల ఉయ్యాలొ,
నెత్తుర్లు పారేను ఉయ్యాల!
చిందిన నెత్తురు ఉయ్యాలొ,
పారేను పల్లెల్లొ ఉయ్యాల!
దిక్కులన్నికూడి ఉయ్యాలొ,
ఉక్కుపిడికిలై లేచె ఉయ్యాల!
చినుకులన్నీ కూడి ఉయ్యాలొ,
తుఫాను పుట్టింది ఉయ్యాల!
చిన్నోల్ల పెద్దోల్ల ఉయ్యాలొ,
చేతులన్నీ కలిసె ఉయ్యాల!
పొడిసేటి పొద్దుల్లొ ఉయ్యాలొ,
పొరుబాటన సాగె ఉయ్యాల!
బువ్వబందులు చేసి ఉయ్యాలొ,
భూమికొసం పోరె ఉయ్యాల!
బందులు చేసిరి ఉయ్యాలొ,
బలిదానలిచ్చిరి ఉయ్యాల!
డప్పుల దరువుల్ల ఉయ్యాలొ,
గుండెల సప్పుల్లు ఉయ్యాల!
ఇందరి పొలికేక ఉయ్యాలొ,
ఢిల్లీని కదిలించె ఉయ్యాల!
అమ్మగారీ దూత ఉయ్యాలొ,
మాటిచ్చి పొయ్యిండు ఉయ్యాల!
ఇన్నేండ్ల త్యాగాలు ఉయ్యాలొ,
కండ్లముంగట మెదిలె ఉయ్యాల!
గడప గడపలోన ఉయ్యాలొ,
గంపెడు ఆశలు ఉయ్యాల!
కొత్తబతుకు మీద ఉయ్యాలొ,
కలలెన్నో కంటెమి ఉయ్యాల!
ఒక్కరోజూ కాలే ఉయ్యాలొ,
కుక్కలెంటావడ్డై ఉయ్యాల!
దోచుకో దొర్కక ఉయ్యాలొ,
దొంగలేకమయ్యిరి ఉయ్యాల!
తెలుగోళ్ళు ఒకటని ఉయ్యాలొ,
కల్లబొల్లికతలల్లే ఉయ్యాల!
నువ్వూ నేను అంతా ఉయ్యాలొ,
అన్నదమ్ములమంట ఉయ్యాల!
ఒక్కవ్వ బిడ్డలైతే ఉయ్యాలొ,
ఒక్కతీరు లేమేంది? ఉయ్యాల!
ప్రాజెక్టులీడైన ఉయ్యాలొ,
పారేటి నెల్లాడ ఉయ్యాల!
క్రిష్ణమ్మ నీల్లుంటె ఉయ్యాలొ,
కన్నీళ్ళు మిగిలేనా? ఉయ్యాల!
గోదారి మాకుంటె ఉయ్యాలొ,
గొడ్లెందుకమ్ముదుం ఉయ్యాల!
కరువుల కోరల్ల ఉయ్యాలొ,
దూప ఆరని నేలలు ఉయ్యాల!
బీడూ జాగాలీడ ఉయ్యాలొ,
మూడు పంటలాడ ఉయ్యాల!
ఎండిన చేలల్ల ఉయ్యాలొ,
తుమ్మలు మొల్శెను ఉయ్యాల!
తాగునీల్లు లేక ఉయ్యాలొ,
ఫ్లోరోసిస్ రోగము ఉయ్యాల!
అన్నదమ్ములమైతె ఉయ్యాలొ,
ఒక్కోలే లేమేంది? ఉయ్యాల!
బొగ్గుబాయిల నేను ఉయ్యాలొ,
బెంజికారుల నువ్వు ఉయ్యాల!
దుబాయి వలసలు ఉయ్యాలొ,
ఎన్నెన్ని తిప్పలు! ఉయ్యాల!
మా కొలువుల్ల నువ్వు ఉయ్యాలొ,
కులికేటి దొంగవు ఉయ్యాల!
ఒకనెంట ఒకడచ్చి ఉయ్యాలొ,
ఒదిగినారిక్కడే ఉయ్యాల!
బతుక వలుస మాది ఉయ్యాలొ,
వలసొచ్చి నువు బలిసె ఉయ్యాల!
మాయలు మంత్రాలు ఉయ్యాలొ,
రియలేస్టేటు దందాలు ఉయ్యాల!
ఏకులోలెవచ్చి ఉయ్యాలొ,
మేకులై కూసుండే ఉయ్యాల!
గులాము నేనైతె ఉయ్యాలొ,
దొరబాబు నువ్వైతివి ఉయ్యాల!
నా భాష,యాసలు ఉయ్యాలొ,
ఎగతాళి నీకాయే ఉయ్యాల!
అక్కవే నువ్వైతే ఉయ్యాలొ,
నక్కబుద్ధులేల ఉయ్యాల!
బలిదానాలీడ ఉయ్యాలొ,
బలుపు పోరులాడ ఉయ్యాల!
లాఠిదెబ్బలీడ ఉయ్యాలొ,
లాబీయింగు లాడ! ఉయ్యాల!
నువ్వు-నేను ఇద్దరు ఉయ్యాలొ,
ఖచ్చితంగా వేరు ఉయ్యాల!
తూటాలు తిన్నోన్ని ఉయ్యాలొ,
తెలంగాణోన్ని నేను ఉయ్యాల!
ఓట్ల బిచ్చపోడు ఉయ్యాలొ,
మా నోట్ల మన్నేశే ఉయ్యాల!
పాణాలు పోతున్న ఉయ్యాలొ,
పదవీకె అతికీరి ఉయ్యాల!
మంటల్ల మండిన ఉయ్యాలొ,
మాటముచ్చటలేదు ఉయ్యాల!
ప్రజాబంధువులు ఉయ్యాలొ,
రాబందులనిపించే ఉయ్యాల!
నాలుక్కొట్లామంది ఉయ్యాలొ,
నక్షలైట్లు అనె ఉయ్యాల!
నాదు స్వతంత్ర్యపోరాతం ఉయ్యాలొ,
నక్షలైట్లె చెశిన్ల? ఉయ్యాల!
మా బతుకు మాకంటె ఉయ్యాలొ,
తప్పెందుకయ్యింది? ఉయ్యాల!
కొలిమంటుకున్నంక ఉయ్యాలొ,
కమిటీలు యెశిన్లు ఉయ్యాల!
కమిటీల పేరున ఉయ్యాలొ,
కాలరాశె చూపు ఉయ్యాల!
అరచేతి అడ్డుతో ఉయ్యాలొ,
సూరీడు ఆగునా? ఉయ్యాల!
ఒక్కొక్క కణమెల్లా ఉయ్యాలొ,
రణభేరి మ్రోగిస్తం ఉయ్యాల!
తల్లడిల్లిన తల్లి ఉయ్యాలొ,
కన్నీళ్ళు తుడుస్తం ఉయ్యాల!
నిలువెల్ల మాకండ్ల ఉయ్యాలొ,
తెలంగాణ సూస్కుంటం ఉయ్యాల…..
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
-అల్లం క్రిష్ణ వంశీ
No comments:
Post a Comment